నిర్మాణాభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నిర్మాణాభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన వివిధ నిర్మాణాభివృద్ధి పనులను నిబంధనల ప్రకారం వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఆయన బెల్లంపల్లి, కన్నేపల్లి, నెన్నెల మండలాల్లో విస్తృతంగా పర్యటించి పలు ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, వైద్యాధికారుల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలల అభివృద్ధి పనుల పరిశీలన
ముందుగా బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ సకల సదుపాయాలు కల్పిస్తోందని, నాణ్యమైన విద్యతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
అనంతరం బెల్లంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను సందర్శించి భోజనశాల నిర్మాణ పనులు, అలాగే నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు
కన్నేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, ఆసుపత్రి పరిసరాలను తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదగా వ్యవహరించాలని, వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
అనంతరం నెన్నెల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ ఆకస్మిక తనిఖీల్లో సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్, విద్యా, వైద్య విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
