పోక్సో కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
పోక్సో కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
- జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
సిరిసిల్ల, ఆంధ్రప్రభ: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం సంచలన తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను గోరింటాల గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపులకు గురి చేయగా, బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి దర్యాప్తు చేపట్టి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
తదుపరి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సీఎంఎస్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టారు.
ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదనలు వినిపించగా, శాస్త్రీయ ఆధారాలు మరియు సాక్షులను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడు కోటగిరి శ్రీనివాస్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించారు.
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరని, శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో వ్యూహాత్మకంగా విచారణ జరిపి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టి శిక్ష పడేలా కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, అప్పటి డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రస్తుత డీఎస్పీ నాగేంద్రచారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్, కోర్టు మానిటరింగ్ ఎస్ఐ రవీందర్ నాయుడు, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సీఎంఎస్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెలను జిల్లా ఎస్పీ అభినందించారు.
