గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాల రాస్తారోకో

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాల రాస్తారోకో

చిత్తూరు హైరోడ్డులో ట్రాఫిక్ స్తంభనం – కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు హైరోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన కారణంగా కొంతసేపు ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాస్తారోకోను ఉద్దేశించి సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రోజురోజుకీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతోందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ధరల పెంపు ద్వారా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

ఒక నెల వ్యవధిలోనే పలుమార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దుర్మార్గమని వారు పేర్కొన్నారు. వంటగ్యాస్ ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డి విరుగుతోందని, దీనిని ప్రజలందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. గతంలో అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాల కారణంగా చమురు కొరత ఏర్పడిందనే సాకుతో ధరలు పెంచారని, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో మాత్రం ఇంధన ధరలను తగ్గించకుండా ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించిన వారు, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కృష్ణా–గోదావరి బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజవాయువులో రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన వాటాను సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేజీ బేసిన్ వనరుల ద్వారా రాష్ట్ర ప్రజలకు చౌకగా ఇంధనం అందించే అవకాశాలు ఉన్నప్పటికీ కేంద్రాన్ని ప్రశ్నించడంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని ఆరోపించారు.

రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఆందోళనలను ప్రజలు బలపరచాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వ ఇంధన ధరల విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఓబుల్‌రాజు, చిట్టెమ్మ, మసూద్, సీపీఐ నాయకులు గోపీనాథ్, రమాదేవి, విజయగౌరి, మణి, విజయ్‌కుమార్, గజేంద్రబాబు, కుమారి, జమీలా బీ, శివ, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply