ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ

ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ

-టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
-రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘన నివాళి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ:
భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్కును సందర్శించి, అక్కడ ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), సాంకేతిక రంగాల అభివృద్ధికి బలమైన పునాది వేయడంతో పాటు, యువతకు రాజకీయ, సామాజిక రంగాల్లో విస్తృత అవకాశాలు కల్పించడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సామాజిక సమానత్వం కోసం రాజీవ్ గాంధీ అందించిన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.

మాతా శిశు ఆసుపత్రిలో రోగుల పరామర్శ..
రాజీవ్ గాంధీ వర్ధంతి సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు ఆమె పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధితులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, సీడీసీ చైర్మన్ గడీల రామ్ రెడ్డి, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, ప్రభుగౌడ్, కౌన్సిలర్ తోపాజి వీణ హరీష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.