త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం

త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం
- అదుపు తప్పి టిప్పర్ బోల్తా
నర్సంపేట, ఆంధ్రప్రభ: నర్సంపేట మండలం ముతోజుపేట టోల్‌గేట్ సమీపంలో బుధవారం ఓ టిప్పర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నల్లబెల్లి మండల కేంద్రం నుండి ఇటుక బట్టీలకు సంబంధించిన మట్టిని తరలిస్తూ వస్తున్న టిప్పర్ (నంబర్: టీఎస్ 24 టీ 1255) మల్లంపల్లి నుండి నర్సంపేట వైపు వెళ్తుండగా ముతోజుపేట టోల్‌గేట్ దగ్గర స్మశాన వాటిక పక్కన ఉన్న లెఫ్ట్ సైడ్ సందు రోడ్డులోకి మలుపు తిరిగే క్రమంలో అనుకోకుండా బోల్తాపడింది.
ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడం అదృష్టకరంగా మారింది. ప్రమాద సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ టిప్పర్ యజమాని నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రఘుపతి రావుగా సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రోడ్డు పక్కనే టిప్పర్ బోల్తా పడటంతో కొంతసేపు వాహనదారులు అప్రమత్త మయ్యారు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
