శ్రీ ఉద్భవలక్ష్మి దేవి ఆలయంలో సంప్రోక్షణ

గర్భగుడిలోకి గుర్తుతెలియని వ్యక్తుల ప్రవేశం నేపథ్యంలో ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రత పునరుద్ధరణ

ఉరవకొండ రూరల్, జులై 9 (ఆంధ్రప్రభ): జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలోని దిగువ ప్రాంతంలో ఉన్న శ్రీ ఉద్భవలక్ష్మి దేవి ఆలయంలో గర్భగుడిలోకి గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా ప్రవేశించిన ఘటన నేపథ్యంలో గురువారం ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా సంప్రోక్షణ (పుణ్యాహవాచనం) కార్యక్రమాలు నిర్వహించారు.

వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ పవిత్రతను పునరుద్ధరించారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు, ధూపదీప నైవేద్యాలు, అర్చనలు నిర్వహించారు. తర్వాత ఆలయ నిత్యకైంకర్యాలు, భక్తుల దర్శనాలను యథావిధిగా పునఃప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆలయ పవిత్రతను పరిరక్షించడం ప్రతి భక్తుడి బాధ్యత అని, ఆలయ ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ భక్తులు సహకరించాలని ఆలయ ఈవో సాకే రమేష్ బాబు, అర్చకులు విజ్ఞప్తి చేశారు.