ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించాలి..

తొర్రూరు, ఆంధ్రప్రభ : తాటి చెట్టు పైనుండి కిందపడి గాయాలపాలయ్యే గీతా కార్మికులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించాలని గోపా జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్ కోరారు.సన్నూరు గ్రామానికి గీతా కార్మికుడు తాండాల సుధాకర్ గౌడ్ తాటిచెట్టు పైనుండి పడి తీవ్ర గాయాల పాలై తొర్రూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మంగళవారం గౌడ సంఘాల నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.గీతా కార్మికునికి కాలు మడిమ, ఛాతి ఎముకలు విరిగి ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు తెలిపారు.ఈ సందర్భంగా కుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…. గీతా కార్మికులు ప్రాణాపాయ స్థితిలో తాటి చెట్ల నుండి కల్లు తీస్తున్నారని, అనేకమంది చెట్టు ఎక్కే క్రమంలో కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజానికి ఆరోగ్యకరమైన కల్లు, నీరాను అందించే గీతా కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. ఆసుపత్రుల పాలయ్యే గీతా కార్మికులు ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఆరోగ్య శ్రీ కింద అన్ని రకాల చికిత్సలు పూర్తిగా ఉచితంగా చేయాలని కోరారు.ఈ పరామర్శలో మోకు దెబ్బ జిల్లా అధ్యక్షుడు ముంజాల రాజేందర్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గండి వీరేందర్ గౌడ్,నాయకులు సురేష్ గౌడ్, కమలాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
