కమనీయంగా కామరతి బీరప్ప కళ్యాణ వేడుక

కమనీయంగా కామరతి బీరప్ప కళ్యాణ వేడుక

బాసర, ఆంధ్రప్రభ:
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని బీరప్ప ఆలయంలో సోమవారం కామారతి బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత కమనీయంగా, కంటిపండువగా జరిగింది. గత వారం రోజులుగా ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా, ఈ రోజు ప్రధాన ఘట్టమైన కళ్యాణ వేడుకను కురుమ సంఘం సాంప్రదాయాల ప్రకారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ పవిత్ర పూజా మహోత్సవంలో ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ వెంకటేష్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లింగరావు, మాజీ సర్పంచ్ లక్ష్మణరావు, ప్రముఖ నాయకులు రమేష్‌లు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఈ ప్రముఖులను కుర్మ సంఘం పెద్దలు, ఆలయ కమిటీ ప్రతినిధులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.

వైభవంగా అన్నదానం
బీరప్ప స్వామి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం సర్పంచ్ వెంకటేష్ గౌడ్ స్వయంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాసర మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణ వేడుకను కళ్లారా వీక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో, భక్తి కోలాహలంతో మురిసిపోయింది.

Leave a Reply