కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోనగిరి భాస్కర్

కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోనగిరి భాస్కర్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ:
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఉప్లూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు బోనగిరి భాస్కర్ నియమితులయ్యారు. పార్టీ అధిష్టానం ఉత్తర్వుల మేరకు, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డిల సమన్వయంతో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు బోనగిరి భాస్కర్‌తో పాటు, పార్టీ కోసం విశేష సేవలందించిన తాజా మాజీ అధ్యక్షుడు సుంకేట రవిని మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాజీ మండల అధ్యక్షుడు సుంకేట రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా, తనకు పూర్తి సహకారం అందిస్తూ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

అందరినీ కలుపుకుని పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తా: బోనగిరి భాస్కర్
నూతన అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం తన సీనియారిటీని గుర్తించి, ఎంతో నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను వమ్ము చేయకుండా నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్ఠం చేసేందుకు అధిష్టానం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా శ్రమిస్తానని పేర్కొన్నారు. సీనియర్ నాయకులను, నమ్ముకున్న కార్యకర్తలను అందరినీ కలుపుకుని, పూర్తి సమన్వయంతో మండలంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తుగా ఎదిగేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ గొప్ప అవకాశం కల్పించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, యూనియన్ కోఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సన్మాన మరియు అభినందనల కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, ఉప్లూర్ గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, ప్రముఖ నాయకులు పడిగేల ప్రవీణ్, ఉప సర్పంచ్ తక్కురి ముత్యం, రాజేష్, నిమ్మ రాజేంద్రప్రసాద్, శైలేందర్, కుంట ఆనంద్, జగదీష్, శేఖర్, నరేష్, శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, విజయ్ కుమార్ తదితర కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply