మైనారిటీ విద్యార్థుల ప్రతిభ గర్వకారణం…

మైనారిటీ విద్యార్థుల ప్రతిభ గర్వకారణం…

ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన టెమ్రిస్ విద్యార్థులు..
కలెక్టరేట్‌లో టాపర్లకు ఘన సన్మానం..
అధ్యాపకుల కృషిని అభినందించిన కలెక్టర్..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : “ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించి మంచిర్యాల జిల్లా పేరును నిలబెట్టడం గర్వకారణం” అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కొనియాడారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ మైనారిటీ గురుకులాలకు చెందిన ఇంటర్ టాపర్లను ఆయన ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మైనారిటీ విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారనే అపోహలను ఈ ఫలితాలు పటాపంచలు చేశాయన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ అద్భుత ప్రతిభ వెనుక ప్రిన్సిపాల్స్, అధ్యాపకుల నిరంతర కృషి, పర్యవేక్షణ ఉందని వారిని అభినందించారు.

కార్పొరేట్ స్థాయి వసతులు, నాణ్యమైన బోధన అందుతున్న మైనారిటీ గురుకులాల్లో తమ పిల్లలను చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ప్రిన్సిపాల్ ఎం.డి. నీలు విద్యార్థుల ప్రతిభను వెల్లడించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం.. ఎంపీసీలో ఎం.డి. ఉమైమా సిద్దిఖీ (455), నారా హరిత (451), జోయా అఫ్షా (443), సల్మా సుల్తానా (443), జిళ్ల రామ్యశ్రీ (443) సత్తా చాటారు. బైపీసీలో బొద్దుల మేఘన (438) మార్కులతో రాష్ట్ర స్థాయి ద్వితీయ ర్యాంకు సాధించగా, సాయి ఆష్రిత (432), కశెట్టి భవిత (428) టాపర్లుగా నిలిచారు. ప్రథమ సంవత్సరంలో మొత్తం 10 మంది విద్యార్థులు 400 పైగా మార్కులు సాధించారు.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం.. బైపీసీలో అమ్ములు సిందూజ (973), మహెక్ నజ్నిన్ (969), ఏ. గజానని (968), సింగర్తి హిరణ్య (968), బట్టు తేజస్విని (964), జిల్లెల శ్రీనిత్య (957) మార్కులతో సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 25 మంది విద్యార్థులు 900కు పైగా మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో డీఎండబ్ల్యూఓ నీరటి రాజేశ్వరి, ఆర్ఎల్సీ షగుఫ్తా ఫిర్దౌస్, విజిలెన్స్ ఆఫీసర్ తహరుద్దీన్, అకాడమిక్ కోఆర్డినేటర్ రిజ్వాన్, ప్రిన్సిపాల్స్ సంధ్య, ఎం.డి. నీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply