ధర్మపురి పట్టణ అభివృద్దే మా ధ్యేయం

ధర్మపురి పట్టణ అభివృద్దే మా ధ్యేయం

  • మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

ధర్మపురి, ఆంధ్రప్రభ: ధర్మపురి పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ధ్యేయమని మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహాయ సహకారాలతో, పట్టణ ప్రజల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికను చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం పట్టణంలోని 6వ వార్డులో నూతన సిమెంట్ కాంక్రీట్ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆమె స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఘనంగా భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ నాగలక్ష్మి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ మున్సిపల్ పాలకమండలి ప్రధాన లక్ష్యమని తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డులో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో, దశలవారీగా గుర్తిస్తూ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం కావడం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ భూమి పూజ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఇందారపు రామన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, 7వ వార్డు కౌన్సిలర్ విజయ్ బాబు, 13వ వార్డు కౌన్సిలర్ చిపిరిశెట్టి రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.