లా అండ్ ఆర్డర్ అదుపులో లేదు

లా అండ్ ఆర్డర్ అదుపులో లేదు

  • ప్రభుత్వ వైఫల్యం వల్లే దాడి
  • కాంగ్రెస్, బిజెపిలు ఒకటైనాయి
  • హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : భారీ చోరీ ఘటనపై నిందితులను పట్టుకోవాలని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతారా అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడి చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తనపై జరిగిన దాడి తీరును మీడియా ప్రతినిధులు, పోలీసులు గమనించారని, రౌడీషీటర్లను పంపించి మరీ దాడి జరిపించారని ఆరోపించారు. ఎమ్మెల్యే కార్యాలయంపై జరిగిన దాడి, తనపై జరిగిన హత్యాయత్నానికి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్‌లో జరిగిన గన్ కల్చర్, దోపిడీ ఘటనలను ప్రశ్నించినందుకే తమపై దాడికి పాల్పడ్డారని, చంపాలనే ఉద్దేశంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.

“హత్య చేసేందుకు కుట్ర పన్నారు”

ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నందుకే తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని కౌశిక్ రెడ్డి అన్నారు. రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌లో శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఒక ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం బాధాకరమన్నారు.

కేసీఆర్, కేటీఆర్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై పనిచేస్తున్నాయనే విషయం ఈ ఘటనతో మరోసారి స్పష్టమైందన్నారు. “చేతనైతే చర్చలకు రావాలి.. కానీ దాడులకు పాల్పడటం చేతగానితనమే” అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సాక్షిగా తనకు భద్రత లేదని చెప్పిన కొన్ని రోజులకే తనపై దాడి జరగడం ఆందోళనకరమన్నారు.

Leave a Reply