మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి

మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి
- జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల (ప్రతినిధి), ఆంధ్రప్రభ:
జోగులాంబ గద్వాల జిల్లాలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోళ్లపై శుక్రవారం ఆయన కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో ‘గూగుల్ మీట్’ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులు, పలు పీఏసీఎస్ (PACS) ల ఆధ్వర్యంలో మొత్తం ఎనిమిది మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
పెరిగిన సాగు – పెరిగిన దిగుబడి: ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జిల్లాలో రైతులు మొక్కజొన్న పంటను పెద్ద ఎత్తున సాగు చేశారని, అందుకే కేంద్రాలకు విక్రయించేందుకు రైతులు భారీగా తరలివస్తున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసిన పంటను వెంటనే తరలించడానికి అవసరమైన లారీలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఎక్కడా గోదాముల కొరత రాకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు నోడల్ అధికారులను నియమించామని, వారు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగడానికి వీలుగా హమాలీల కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. మొక్కజొన్న రైతులకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సంబంధిత శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ గూగుల్ మీట్ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, ఆర్డీవో శ్రీనివాసరావు, మార్క్‌ఫెడ్ డీఎం చంద్రమౌళి, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, డీపీఓ శ్రీకాంత్, ఆర్టీవో టీవీ రావు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
