ఘనంగా ప్రారంభమైన 16వ జాతీయ ఓపెన్ తైక్వాండో పోటీలు

ఘనంగా ప్రారంభమైన 16వ జాతీయ ఓపెన్ తైక్వాండో పోటీలు

గద్వాల (ప్రతినిధి), ఆంధ్రప్రభ

జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలోని బృందావన్ గార్డెన్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న 16వ జాతీయ ఓపెన్ తైక్వాండో పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్ మున్సిపల్ చైర్‌పర్సన్ జయలక్ష్మి నర్సింహులు, వైస్ చైర్మన్ శంకర్, గద్వాల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమంతు, పట్టణ కౌన్సిలర్లు, సంస్కార్ స్కూల్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

నాట్య తరంగిణి డాన్స్ అకాడమీ నృత్య విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. అనంతరం ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికారికంగా 16వ జాతీయ ఓపెన్ తైక్వాండో పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల్‌లో జాతీయ స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించడం ఎంతో గర్వకారణమని తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్‌లు, తల్లిదండ్రులకు హృదయపూర్వక స్వాగతం మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంలో ఇలాంటి పోటీల పాత్ర ఎంతో ముఖ్యమని, గద్వాల్‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకువస్తాయని పేర్కొన్నారు.

పోటీల్లో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారుడు తమ ప్రతిభను చాటి రాష్ట్రం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు ముట్ట శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ మాస్టర్ కె. శ్రీహరి మరియు అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ జాతీయ పోటీలకు దాదాపు 20 రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది క్రీడాకారులు విచ్చేయగా, రెండు రోజుల పాటు పోటీలు కొనసాగనున్నాయి.

Leave a Reply