కబడ్డీ క్రీడాకారులకు దాతల అండ..

కబడ్డీ క్రీడాకారులకు దాతల అండ..
- వెల్టూర్ శిక్షణ శిబిరానికి నగదు సాయం అందజేత
అచ్చంపేట, ఆంధ్రప్రభ ; విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని గ్రామ మొదటి వార్డు మెంబర్ కాసిరెడ్డి అభితేజ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో కొనసాగుతున్న కబడ్డీ శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించి క్రీడాకారులకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..మారుమూల గ్రామాల నుంచి విద్యార్థులు వెల్టూర్‌కు వచ్చి శిక్షణ పొందడం అభినందనీయమన్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు ఇటువంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. అనంతరం గ్రామ మొదటి వార్డు మెంబర్ కాసిరెడ్డి అభితేజ్ రెడ్డి రూ.5 వేల నగదు సహాయం అందజేశారు. అలాగే ప్రైవేట్ ఉపాధ్యాయులు దేరెడ్డి రాంరెడ్డి రూ.2 వేలును, గంట సతీష్ కుమార్ యాదవ్ రూ.3 వేలును క్రీడాకారులకు అందించారు. వారిని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్ విద్యార్థులతో కలిసి శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ బూరం నరేష్ యాదవ్, గుద్దటి బాలరాజు, ఎండి సమ్మదు తదితరులు పాల్గొన్నారు.
