నకిలీ ‘బీటీ-3’ పత్తి విత్తనాల అమ్మకాలను అరికట్టాలి

నకిలీ ‘బీటీ-3’ పత్తి విత్తనాల అమ్మకాలను అరికట్టాలి
- బీజేపీ డిమాండ్
చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలో అక్రమంగా విక్రయిస్తున్న నకిలీ మరియు నిషేధిత ‘బీటీ-3’ పత్తి విత్తనాల అమ్మకాలను తక్షణమే అరికట్టాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అధికారులను కోరారు.
వ్యవసాయ శాఖ అధికారులు, అధికార పార్టీ నాయకుల అండదండలతోనే మండలంలో నకిలీ బీటీ-3 విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ నకిలీ విత్తన విక్రయాలను అరికట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారికంగా నిషేధించిన బీటీ-3 పత్తి విత్తనాలను అమ్ముతూ, గత ఏడాది కాలంగా అమాయక రైతులను నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండతో, మండలంలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఈ విత్తనాలను మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్నారని పేర్కొన్నారు. అలా తెచ్చిన నిషేధిత విత్తనాలను అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్లలోనే గుట్టుచప్పుడు కాకుండా డంపింగ్ చేస్తున్నారని, ఆ తర్వాత రాత్రి సమయాల్లో రైతులకు విపరీతమైన అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఇలాంటి నకిలీ విత్తన ముఠాలపై వారికి సహకరిస్తున్న వారిపై వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
