దేశ ఆర్థిక భద్రత కోసం ‘సప్త సూత్రాలు’ పాటించాలి

దేశ ఆర్థిక భద్రత కోసం ‘సప్త సూత్రాలు’ పాటించాలి

ప్రతి పౌరుడు బాధ్యతగా ఆచరించాలి – మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన “సప్త సూత్రాలు – సప్త పరివర్తన”ను ప్రతి పౌరుడు బాధ్యతగా ఆచరించాలని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బూర నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు.

గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ యుద్ధాలు, గల్ఫ్ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న తరుణంలో దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

దేశం ప్రస్తుతం సుమారు 300 బిలియన్ డాలర్ల ట్రేడ్ డెఫిసిట్‌ను ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా 700 బిలియన్ డాలర్ల దిగుమతులు జరుగుతుండగా, ఎగుమతులు 400 బిలియన్ డాలర్లకే పరిమితమవుతున్నాయని, ఇది రూపాయి విలువపై ప్రభావం చూపుతోందని వివరించారు.

ఈ లోటును పూడ్చేందుకు ప్రధానమంత్రి మోదీ ఒక కుటుంబ పెద్దగా కొన్ని కీలక సూచనలు చేశారని తెలిపారు.

సప్త సూత్రాల్లో భాగంగా ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసి ఉత్పాదక రంగాల్లో పెట్టుబడిగా మళ్లించాలని సూచించారు. అలాగే పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని చెప్పారు.

సాధ్యమైన చోట వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించడం, వంటనూనె వినియోగం తగ్గించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆర్థిక లాభాలు సాధించవచ్చని తెలిపారు. విదేశీ బ్రాండ్లకు బదులుగా స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ తగ్గించి దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని, ఎరువుల దిగుమతిని తగ్గించేలా ఆర్గానిక్ వ్యవసాయాన్ని చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.

“యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః” అనే శ్లోకాన్ని ఉదహరిస్తూ నాయకులే ఆదర్శంగా నిలవాలని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఈ సూచనలను రాజకీయ కోణంలో కాకుండా జాతీయ ప్రయోజనంగా భావించి ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

Leave a Reply