రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

సాగు ఖర్చులు తగ్గించుకుంటూ శాస్త్రీయ పద్ధతులు అవలంబించాలి – ప్రభావతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
రైతులు వ్యవసాయంలో అనవసర ఖర్చులను తగ్గించుకొని శాస్త్రీయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త ప్రభావతి సూచించారు.

గురువారం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ రైతులు ఎకరానికి రెండు బస్తాల యూరియాను మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. భూసారాన్ని పెంచుకోవడానికి జీలుగ సాగు చేసి కలియదున్నాలని, దీనివల్ల రసాయనిక ఎరువుల అవసరం తగ్గుతుందని తెలిపారు.

వానాకాలం సీజన్‌లో కేవలం ధ్రువీకరించిన (సర్టిఫైడ్) విత్తనాలనే వాడాలని, నారుమడిలో రెండు కిలోల గుళికలు మాత్రమే వేయాలని సూచించారు. అలాగే పురుగు మందుల విషయంలో అప్రమత్తంగా ఉండి ధ్రువీకరించిన మందులనే వినియోగించాలని రైతులకు సూచించారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ రైతులు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు.

పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పంట మార్పిడి విధానాన్ని పాటించడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, ఏఎంసీ ప్రతినిధులు, పంచాయతీ సభ్యులు, శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave a Reply