తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఖాయం

తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఖాయం
-చిట్యాల మండల అధ్యక్షులు పీక వెంకన్న ముదిరాజ్
చిట్యాల, ఆంధ్రప్రభ: రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చిట్యాల మండల బీజేపీ అధ్యక్షులు పీక వెంకన్న ముదిరాజ్ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిన సందర్భంగా సోమవారం వనిపాకల గ్రామంలో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు నిర్వహించారు.
మోదీ నాయకత్వానికే ప్రజల మద్దతు
ఈ సందర్భంగా వెంకన్న ముదిరాజ్ మాట్లాడుతూ.. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మోదీపై ప్రజలకున్న నమ్మకమే ఈ ఫలితాలని కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ కమలం జెండా ఎగురవేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పునాది వేస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సురేష్, శివకోటి ప్రవీణ్, అఖిల్, సత్తయ్య, అనసూయ, సత్తమ్మ, సరిత, అనూష తదితరులు పాల్గొన్నారు. ఇంద్రవెల్లి, తొర్రూరు వంటి ప్రాంతాల తరహాలోనే చిట్యాలలో కూడా బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున విజయోత్సవాల్లో నిమగ్నమయ్యారు.
