తొర్రూరులో బీజేపీ శ్రేణుల విజయోత్సవాలు
తొర్రూరులో బీజేపీ శ్రేణుల విజయోత్సవాలు
తొర్రూరు, ఆంధ్రప్రభ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత ప్రదర్శన కనబరిచి అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో పాటు బెంగాల్లో బలమైన శక్తిగా ఆవిర్భవించిన సందర్భంగా తొర్రూరులో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. సోమవారం తొర్రూరు అర్బన్, రూరల్ మండల అధ్యక్షులు పైండ్ల రాజేష్, గట్టు రాంబాబుల ఆధ్వర్యంలో పట్టణంలోని విశ్రాంతి భవనం (గెస్ట్ హౌస్) ముందు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.
మోదీ నాయకత్వం దేశానికి శ్రీరామరక్ష: పల్లె కుమార్
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె కుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసమే ఈ విజయమని కొనియాడారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ సొంత గడ్డ అయిన బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయడం ఆయనకు దక్కిన నిజమైన నివాళి అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ కమలం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు. మోదీ పాలన దేశానికి శ్రీరామరక్ష అని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని తెలిపారు.
ఈ సంబరాల్లో బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు అలిసేరి రవిబాబు, మండల ప్రధాన కార్యదర్శులు నడిగడ్డ సందీప్, గుగులోత్ భాస్కర్ పాల్గొన్నారు. వీరితో పాటు అమ్మాపురం ఉప సర్పంచ్ సిరిపాటి విశాల్, గడల శేఖర్, దూకుంట్ల విజయ, వెలగపూడి శోభారాణి, సి.హెచ్. విజయ్ కుమార్, గుండా సురేష్, గట్ల భరత్, గంధం రాజు, కొండపల్లి శ్రీను, బండి శ్రీనివాస్, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.
