గృహ గణనలో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలి…

గృహ గణనలో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలి…
- తాసిల్దార్ స్రవంతి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, ఆంధ్రప్రభ : జనాభా లెక్కల సేకరణలో భాగంగా మొదటి దశలో నిర్వహిస్తున్న ఇండ్ల జాబితా గృహ గణన కార్యక్రమంలో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని గరిడేపల్లి మండల తహసీల్దార్ స్రవంతి కోరారు. మండలంలోని పొనుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనున్న ఇళ్ల జాబితా, గృహ గణన కార్యక్రమంలో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని ఆమె కోరారు.
జాతీయ అభివృద్ధి ప్రణాళికలో భాగస్వామ్యులైనందుకు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ప్రజలు కూడా తమ ఇంటికి వచ్చిన అధికారికి ఖచ్చితమైన సమాచారాన్ని అందించి సహకరించాలని కోరారు. ప్రజల నుంచి సేకరించిన సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు స్వీయ గణన చేసుకునే అవకాశం ఉందని, దీనిని ఉపాధ్యాయ ఉద్యోగులందరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మీరంతా స్వీయ గణన చేసుకోవడమే కాకుండా తమ సమీప బంధుమిత్రులకు కూడా అవగాహన కల్పించి అధిక సంఖ్యలో స్వీకరణ ప్రక్రియ జరిగేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫీల్డ్ ట్రైనర్లు గోదేశి దయాకర్, రణబోతు రవీందర్, అసిస్టెంట్ గణాంక అధికారి గోపి, టెక్నికల్ అసిస్టెంట్ అలీ తో పాటు మండలంలోని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
