సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

25 ఏళ్లకు పైగా సేవలందించిన టీచర్లకు టెట్ తప్పనిసరి చేయడం సరికాదు: ఏపీటీఎఫ్

నంద్యాల, ఆంధ్రప్రభ : పాతికేళ్లకు పైగా సేవలందిస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) డిమాండ్ చేసింది.

ఈ మేరకు శనివారం ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.వి. శివయ్య అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 25 నుంచి 30 సంవత్సరాల సర్వీస్ కలిగిన ఉపాధ్యాయులను టెట్ పరీక్ష రాయాలని ఆదేశించడం సబబు కాదన్నారు. ఉపాధ్యాయులు ఇప్పటికే డీఎస్సీ ద్వారా ఎంపికై, అన్ని అర్హతలు సాధించి ఉద్యోగంలో చేరారని గుర్తు చేశారు.

డీఎస్సీ నోటిఫికేషన్‌లో నిర్దేశించిన అన్ని నియమ నిబంధనలను పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారిని మళ్లీ టెట్ రాయమని చెప్పడం సరైన విధానం కాదన్నారు. ఇతర శాఖల్లో లేని విధంగా ఉపాధ్యాయులకు మాత్రమే ఇటువంటి నిబంధనలు విధించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 2023 జూలై 1 నుంచి పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, బకాయిపడిన నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాకీర్ హుస్సేన్, వీరేశ్వర్ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎం. భాస్కర్ రెడ్డి, జిల్లా సబ్ కమిటీ సభ్యులు దస్తగిరి భాషా, సుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, రాజేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.