Temple Development | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Temple Development | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Temple Development | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కోసం మొదటి విడతగా రూ.1,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖ‌మ్మం జిల్లా కూసుమంచిలోని రామ‌లింగేశ్వ‌ర ఆల‌య వ‌ద్ద వివిధ అభివృద్ధి ప‌నుల‌కు ఆయ‌న శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

భద్రాచల దేవాలయ అభివృద్ధిపై గత ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదని విమర్శించిన మంత్రి, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు రూ.350 కోట్లను మంజూరు చేసిందని వెల్లడించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి అన్ని పనులను పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

మేడారం జాతరను అద్భుతంగా నిర్వహించడమే కాకుండా, మేడారం ప్రాంత అభివృద్ధికి రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వివరించారు. కూసుమంచిలోని చారిత్రాత్మక శివాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా చూస్తూ, మతాలకు అతీతంగా ఆలయాలు, చర్చిలు, మసీదుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, కొన్ని పార్టీలు దేవాలయాల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిధులు కేటాయిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.