Road Expansion | 100 అడుగుల రహదారి విస్తరణతో జీవనోపాధిపై ముప్పు

Road Expansion | 100 అడుగుల రహదారి విస్తరణతో జీవనోపాధిపై ముప్పు

అభివృద్ధితో పాటు పునరావాసం, పరిహారం కల్పించి మంథని వ్యాపారాన్ని కాపాడాలని విజ్ఞప్తి

Road Expansion | మంథని టౌన్, ఆంధ్రప్రభ : మంథని పట్టణంలో చేపడుతున్న 100 అడుగుల రహదారి విస్తరణ పనులు భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడనున్నప్పటికీ, మరోవైపు దశాబ్దాలుగా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వందలాది మంది చిరు వ్యాపారులు, నివాస గృహాల యజమానుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
బొక్కల వాగు వంతెన నుంచి ఆర్టీసీ బస్ డిపో వరకు చేపడుతున్న రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న అనేక దుకాణాలు, కొన్ని నివాస గృహాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ జీవనాధారాన్ని, నివాసాలను కోల్పోతామనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు.
మంథని పట్టణానికి ప్రధాన వాణిజ్య కేంద్రంగా పేరొందిన ఈ ప్రాంతంలో అనేక కుటుంబాలు చిన్నచిన్న దుకాణాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. రహదారి విస్తరణ కారణంగా దుకాణాలు కోల్పోతే కుటుంబ పోషణతో పాటు ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా, అనేక మంది వ్యాపారులు తమ దుకాణాలను ఆధారంగా చేసుకుని బ్యాంకులు, సహకార సంఘాలు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలకు రోజువారీ, వారానికోసారి, నెలవారీ కిస్తీలు చెల్లిస్తూ వస్తున్నారు. దుకాణాలు కోల్పోతే ఆదాయం నిలిచిపోవడంతో రుణాల చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కేవలం వ్యాపార నష్టానికే పరిమితం కాకుండా పిల్లల చదువులు, కుటుంబ వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు, నిత్యావసర ఖర్చులు భరించడం కూడా కష్టసాధ్యమవుతుందని వ్యాపారులు వాపోతున్నారు. అద్దె భవనాల్లో వ్యాపారం నిర్వహిస్తూ, అదే భవనాల్లో నివసిస్తున్న కుటుంబాలు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
ఇప్పటికే జిల్లాల పునర్విభజన అనంతరం మంథనికి వ్యాపారపరంగా గణనీయమైన ప్రభావం పడిందని వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. గతంలో మల్హర్‌రావు, కాటారం, మహదేవ్‌పూర్, ముత్తారం తదితర తూర్పు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు మంథనికి వచ్చి కొనుగోళ్లు నిర్వహించేవారని, జిల్లాల విభజన తర్వాత ఆ రాకపోకలు తగ్గిపోవడంతో వ్యాపారాలు మందగించాయని వారు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం కూడా మంథని మార్కెట్‌పై ఆధారపడి పరిసర గ్రామాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు కొనుగోళ్ల కోసం వస్తుంటారు. ఈ చిరు వ్యాపారులే మంథని మార్కెట్‌కు జీవం పోస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం

రోడ్డు విస్తరణతో కేవలం పెద్ద దుకాణాలే కాదు, రోజువారీ జీవనోపాధిపై ఆధారపడిన వందలాది మంది చిరు వ్యాపారులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. పూలు విక్రయించే వారు, పాల విక్రేతలు, చికెన్ సెంటర్లు, చేపల వ్యాపారులు, కూరగాయల విక్రేతలు, చిరు బట్టల వ్యాపారులు, బొమ్మల దుకాణాలు, ప్లాస్టిక్ వస్తువుల విక్రేతలు, అద్దాల దుకాణాలు, చిన్నచిన్న జనరల్ స్టోర్లు, చెప్పుల దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, టీ దుకాణాలు, మొబైల్ రిపేర్ షాపులు, స్టేషనరీ దుకాణాలు, సెలూన్లు, చిన్న హోటళ్లు మాత్రమే కాకుండా, రోడ్డు పక్కన ఉన్న పంచర్ షాపులు, రెక్సిన్ వర్కులు, పిండి మిల్లులు, వెల్డింగ్, మెకానిక్ షాపులు, ఇతర చేతివృత్తులపై ఆధారపడిన చిన్న వ్యాపారులు కూడా తమ వ్యాపార స్థలాలను ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఇప్పటికే కూరగాయల వ్యాపారులను తాత్కాలిక మార్కెట్‌కు తరలించినప్పటికీ, మిగిలిన అనేక మంది చిన్న వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు అందుబాటులో లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంథని పట్టణంలో వ్యాపారాలకు అనువైన దుకాణాలు, గదులు కూడా సులభంగా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు వ్యాపారులు వ్యాపారాలను పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుండగా, మరికొందరు పట్టణంలోని వేర్వేరు ప్రాంతాలకు చెల్లాచెదురుగా వెళ్లిపోతున్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా మూడు నెలల గడువు ఇచ్చినప్పటికీ, అంత తక్కువ సమయంలో కొత్త స్థలం వెతుక్కొని మళ్లీ వ్యాపారాన్ని నిలబెట్టుకోవడం సాధ్యం కాదని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలుగా ఏర్పరుచుకున్న వినియోగదారులను కోల్పోయి కొత్త ప్రాంతంలో తిరిగి వ్యాపారం ప్రారంభించడం ఆర్థికంగా ఎంతో భారమని వారు చెబుతున్నారు.
వ్యాపారులు ఒకేచోట లేకపోవడంతో వినియోగదారులు కూడా అవసరమైన వస్తువుల కోసం ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇది మంథని ప్రధాన మార్కెట్ రద్దీని, వాణిజ్య చైతన్యాన్ని తగ్గించే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.

చెల్లాచెదురవుతున్న మంథని వ్యాపారం

గతంలో ఒకేచోట కళకళలాడిన మంథని మార్కెట్ ప్రస్తుతం చెల్లాచెదురవుతోంది. కూరగాయల వ్యాపారులను ఒకేచోట తాత్కాలిక మార్కెట్‌లో ఏర్పాటు చేసినప్పటికీ, మిగతా చిరు వ్యాపారులు, సేవారంగ వ్యాపారులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది. దీంతో వినియోగదారులు కూడా ఒకేచోట అన్ని వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది భవిష్యత్తులో మంథని వాణిజ్య వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

నివాస గృహాలపైనా ప్రభావం

ఈ రహదారి విస్తరణతో వ్యాపార సంస్థలే కాకుండా కొన్ని నివాస గృహాలు కూడా ప్రభావితమవుతున్నాయి. కొందరు తమ ఇళ్లను పూర్తిగా కోల్పోవాల్సి వస్తుండగా, మరికొందరు ఇంటిలో కొంత భాగాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబాలు ప్రత్యామ్నాయ నివాసాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.

రోడ్డు విస్తరణతో లాభాలివే…

100 అడుగుల రహదారి పూర్తయితే మంథని పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు భారీ వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయి. భవిష్యత్తులో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పట్టణం విస్తరించే అవకాశం ఉంటుంది. కొత్త పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, భూముల విలువ పెరగడం, పట్టణ సౌందర్యం మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

నష్టాలూ అంతే తీవ్రం…

మరోవైపు వందలాది మంది చిరు వ్యాపారులు జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. బ్యాంకు రుణాలు, ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లల చదువులు, కుటుంబాల వైద్యం, ఇంటి అద్దెలు, ఉద్యోగుల జీతాలు వంటి బాధ్యతలు నిర్వహించడం కష్టతరమవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా మెడికల్ షాపులు, కిరాణా దుకాణాలు, నిత్యావసర వస్తువుల దుకాణాలు తాత్కాలికంగా మూతపడితే ప్రజలకు కూడా తీవ్ర అసౌకర్యం కలిగే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మున్సిపల్‌, విద్యుత్ శాఖల ఆదాయంపైనా ప్రభావం

100 అడుగుల రహదారి విస్తరణలో భాగంగా దాదాపు 30 నుంచి 40 దుకాణాలు పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో మున్సిపల్ ఆదాయంపైనా ప్రభావం పడే అవకాశముందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ దుకాణాల నుంచి ప్రతి నెలా అద్దెలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ఇతర పన్నుల రూపంలో మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
అదే విధంగా ఈ దుకాణాల ద్వారా ప్రతి నెలా విద్యుత్ వినియోగానికి చెల్లించే కరెంటు బిల్లుల రూపంలో విద్యుత్ శాఖకు వచ్చే ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దుకాణాలు పూర్తిగా తొలగిపోవడం లేదా చాలా కాలం మూతపడడం వల్ల మున్సిపల్ ఆదాయంతో పాటు విద్యుత్ శాఖకు కూడా ఆర్థిక ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ప్రభావిత వ్యాపారులకు తక్షణమే ప్రత్యామ్నాయ దుకాణాలు, తాత్కాలిక వ్యాపార సముదాయం ఏర్పాటు చేసి వ్యాపారాలు నిరంతరంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటే మున్సిపాలిటీ, విద్యుత్ శాఖలకు కలిగే ఆదాయ నష్టాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చని పలువురు సూచిస్తున్నారు.

అభివృద్ధికి సహకరిస్తూనే… మనోవేదనలో వ్యాపారులు

రోడ్డు విస్తరణకు సహకరిస్తూ చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను తొలగిస్తున్నప్పటికీ, తమ జీవితకాల శ్రమతో నిలబెట్టుకున్న వ్యాపారాలు కళ్లముందే కూలిపోతుండటంతో లోలోపల తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. “అభివృద్ధిని మేమెప్పుడూ వ్యతిరేకించలేదు… కానీ మా కుటుంబాల భవిష్యత్తు ఏమవుతుంది?” అనే ప్రశ్న వారిని వెంటాడుతోంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తూనే, తమ జీవనోపాధికి కూడా భరోసా కల్పించాలని వారు వేడుకుంటున్నారు. చిరు వ్యాపారులకు భరోసా కల్పించి, వారికి ప్రత్యామ్నాయ వసతులు కల్పిస్తే మంథని మళ్లీ వాణిజ్యపరంగా కళకళలాడుతుందని, పరిసర గ్రామాల నుంచి మరింత మంది ప్రజలు కొనుగోళ్ల కోసం వచ్చి పట్టణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. లేకపోతే ఇప్పటికే మందగించిన మంథని వ్యాపారం మరింత క్షీణించి పట్టణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి కోసం రహదారి విస్తరణ ఎంత అవసరమో, ఆ అభివృద్ధి భారాన్ని మోస్తున్న చిరు వ్యాపారులు, నివాస గృహాల యజమానులను ఆదుకోవడం కూడా అంతే అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు విస్తరణతో నష్టపోయే ప్రతి వ్యాపారికి, ప్రభావిత కుటుంబానికి పునరావాసం, తగిన పరిహారం, ప్రత్యామ్నాయ వ్యాపార స్థలం, సమగ్ర తాత్కాలిక వ్యాపార సముదాయం, రుణాల పునర్వ్యవస్థీకరణ, నిత్యావసర సేవల కొనసాగింపుకు ప్రత్యేక ప్రణాళిక వంటి చర్యలు చేపట్టినప్పుడే మంథని అభివృద్ధి నిజమైన ప్రజా అభివృద్ధిగా నిలుస్తుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మంథనిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పాటు, ఆ అభివృద్ధికి బలమైన పునాది అయిన చిన్న వ్యాపారులను కాపాడితేనే పట్టణం భవిష్యత్తులో మరింత వాణిజ్యపరంగా, ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.