ప్రజల సంతృప్తే వైద్య సేవలకు అసలైన కొలమానం
- దుర్గాపురం పీహెచ్‌సీ తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రావణ్ బాబు
- సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి
- ఓపీ నుంచి ప్రసూతి సేవల వరకు సమగ్ర తనిఖీ
- నాణ్యమైన సేవలపై డీఎంహెచ్‌వో ఆదేశాలు
విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రజలకు అందుతున్న వైద్య సేవల్లో నాణ్యత, పారదర్శకత, సంతృప్తి మరింత పెరగాలని, ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రోగి అభిప్రాయానికే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. శ్రావణ్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన విజయవాడ దుర్గాపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలపై సమగ్ర తనిఖీ నిర్వహించారు.
పర్యటన సందర్భంగా ఓపీ విభాగం, ప్రయోగశాల, ఫార్మసీ, నర్సింగ్ విభాగం, వార్డులు, గర్భిణుల (ఆంటీనేటల్), ప్రసవానంతర (పోస్ట్‌నేటల్) సేవలు, సార్వత్రిక రోగనిరోధక టీకాల కార్యక్రమం (యూఐపీ), తల్లి-శిశు సంక్షేమ సేవలు (ఎంసీహెచ్)తో పాటు అన్ని రికార్డులు, నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు. సేవల అమలు తీరుపై సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అందుబాటులో ఉంచిన వనరులను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు నాణ్యమైన, సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు.
రోగులు ఆస్పత్రి నుంచి సంతృప్తితో వెళ్లేలా సేవలు అందించాలని, ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్ ద్వారా సేవలు పొందిన ప్రతి రోగి తన సెల్‌ఫోన్‌తో స్కాన్ చేసి పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ లో అభిప్రాయం నమోదు చేసేలా వైద్య సిబ్బంది చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే స్పందనే ప్రభుత్వ వైద్య సేవల నాణ్యతకు అసలైన కొలమానమని, ఆ అభిప్రాయాల ఆధారంగానే సేవలను మరింత మెరుగుపరచడం సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రతి రోజు ప్రజలకు మరింత మెరుగైన, సంతృప్తికరమైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పనిచేయాలని డాక్టర్ శ్రావణ్ బాబు సూచించారు. ఈ తనిఖీలో జిల్లా ప్రోగ్రామ్ అధికారి మహేశ్వరరావు, దుర్గాపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సృజన, ల్యాబ్ టెక్నీషియన్ రత్నరాజు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

