అంకిరెడ్డిగూడెంలో అదనపు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి
ఎస్‌ఐఆర్ సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజల సౌకర్యం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ బూతులను ఏర్పాటు చేయాలని చౌటుప్పల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను కోరారు.
మునుగోడు నియోజకవర్గంలోని చండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) సమీక్షా సమావేశంలో వారు పాల్గొని పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
ఈ సందర్భంగా గిర్కటి నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీలో ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నందున ప్రజల సౌకర్యార్థం అదనపు పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఎల్లంబావి గ్రామపంచాయతీకి ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని కేటాయించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్ మున్సిపాలిటీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో వార్డుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు. దీనికి అనుగుణంగా వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఓటర్లకు సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఉంటే పోలింగ్ శాతం పెరిగి ఎన్నికల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందని పేర్కొన్నారు.
సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
