కన్నుల పండుగగా నరసింహస్వామి రథోత్సవం

కన్నుల పండుగగా నరసింహస్వామి రథోత్సవం

-పోటెత్తిన భక్తజనం.. గోవింద నామస్మరణతో మారుమోగిన క్షేత్రం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన బ్రహ్మరథోత్సవం బుధవారం భక్తజన సందోహం మధ్య కన్నుల పండుగగా జరిగింది.

రథోత్సవం సందర్భంగా తెల్లవారుజామునే స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకం నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలు, మణిమయ ఆభరణాలతో స్వామివారిని అత్యద్భుతంగా అలంకరించారు. బలిహరణ, మహా మంగళహారతి అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగించి, ప్రత్యేకంగా అలంకరించిన రథంపై కొలువుదీర్చారు.

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విప్ శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ రేగాటి నాగరాజు తదితరులు రథోత్సవం ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మడుగుతేరును భక్తులతో కలిసి లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. సాయంత్రం వేళ మాడ వీధుల్లో రథం కదులుతుంటే భక్తులు కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ వేడుకను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు ఆధ్వర్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ మహానంది, ఎస్సై జనార్ధన్ నాయుడు పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహసిల్దార్ భోగన్న గౌడ్, ఎంపీడీవో రవి ప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ భాస్కర్ మరియు పలువురు టిడిపి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply