ఆత్మకూర్‌లో ఏసీబీ దాడులు.. జీపీఓ అరెస్ట్
మెట్పల్లి రూరల్, ఆంధ్రప్రభ: మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో గ్రామ పాలనాధికారి (జీపీఓ)గా విధులు నిర్వహిస్తున్న రాజేష్ లంచం తీసుకుంటుండగా గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆత్మకూర్ గ్రామానికి చెందిన ఓ రైతు పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైన పేరును సరిచేయించేందుకు దరఖాస్తు చేసుకోగా, ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి జీపీఓ రాజేష్ రూ.5 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది.
బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళికతో వల పన్ని, రైతు నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటున్న సమయంలో జీపీఓ రాజేష్‌ను పట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, బాధితుడి ఫిర్యాదు మేరకు ట్రాప్ నిర్వహించి జీపీఓ రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఘటనకు సంబంధించిన ఫైల్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
