ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల..

  • మొత్తం ఓటర్లు 17.90 లక్షలు
  • ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు అవకాశం..
  • జిల్లాలో 2.48 లక్షల పేర్లు తొలగింపు

అనంతపురం, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్)ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ. ఆనంద్ శుక్రవారం విడుదల చేశారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జాబితాను విడుదల చేసిన అనంతరం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఎన్నికల నమోదు అధికారులకు (ఈఆర్‌ఓలు) ప్రతులను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 17,90,436 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. వీరిలో పురుషులు 8,83,174 మంది (49.33 శాతం), మహిళలు 9,07,053 మంది (50.66 శాతం), ట్రాన్స్‌జెండర్లు 209 మంది (0.01 శాతం) ఉన్నారని వివరించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో 2,48,087 మంది (12.17 శాతం) ఓటర్ల పేర్లను వివిధ కారణాలతో తొలగించినట్లు తెలిపారు. వీరిలో ఆచూకీ లేని వారు 46,276 మంది (2.27 శాతం), శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు 79,582 మంది (3.90 శాతం), మరణించిన వారు 75,378 మంది (3.70 శాతం), డూప్లికేట్ ఓటర్లు 46,452 మంది (2.28 శాతం), ఇతర కారణాలతో 399 మంది (0.02 శాతం) ఉన్నట్లు వెల్లడించారు.

ముసాయిదా ఓటర్ల జాబితాపై ఎవరైనా క్లెయిమ్‌లు లేదా అభ్యంతరాలు తెలియజేయాలనుకుంటే జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు తమ వివరాలను ఆన్‌లైన్‌లో లేదా కలెక్టర్ కార్యాలయం, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ కార్యాలయాలు, సంబంధిత బీఎల్‌ఓల వద్ద కార్యాలయ వేళల్లో పరిశీలించుకోవచ్చన్నారు.

నియోజకవర్గాల వారీగా ఓటర్లు

  • రాయదుర్గం: 2,36,579 మంది (పురుషులు 1,17,518, మహిళలు 1,19,019, ట్రాన్స్‌జెండర్లు 42)
  • ఉరవకొండ: 2,03,306 మంది (పురుషులు 1,00,480, మహిళలు 1,02,801, ట్రాన్స్‌జెండర్లు 25)
  • గుంతకల్లు: 2,44,853 మంది (పురుషులు 1,19,335, మహిళలు 1,25,459, ట్రాన్స్‌జెండర్లు 59)
  • తాడిపత్రి: 2,19,095 మంది (పురుషులు 1,08,157, మహిళలు 1,10,920, ట్రాన్స్‌జెండర్లు 18)
  • సింగనమల: 2,22,458 మంది (పురుషులు 1,10,485, మహిళలు 1,11,945, ట్రాన్స్‌జెండర్లు 28)
  • అనంతపురం అర్బన్: 2,28,673 మంది (పురుషులు 1,10,262, మహిళలు 1,18,392, ట్రాన్స్‌జెండర్లు 19)
  • కళ్యాణదుర్గం: 2,10,918 మంది (పురుషులు 1,04,752, మహిళలు 1,06,157, ట్రాన్స్‌జెండర్లు 9)
  • రాప్తాడు: 2,24,554 మంది (పురుషులు 1,12,185, మహిళలు 1,12,360, ట్రాన్స్‌జెండర్లు 9)

జిల్లాలో మొత్తం 2,021 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వీరిలో రాయదుర్గం-65, ఉరవకొండ-235, గుంతకల్లు-408, తాడిపత్రి-207, సింగనమల-413, అనంతపురం అర్బన్-170, కళ్యాణదుర్గం-123, రాప్తాడు-400 మంది ఉన్నారని వివరించారు.

కార్యక్రమంలో డీఆర్ఓ ఏ. మలోల, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ కనకరాజ్, సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్‌తో పాటు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.