ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరం
మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల భాగస్వామ్యం తప్పనిసరి అని, అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి అన్నారు.
శనివారం మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాన్ని పురస్కరించుకుని తల్లిదండ్రులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవినేని అరవిందరాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఈఓ బిక్షపతి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ విద్యా సంవత్సరంలో 150 మందికి పైగా కొత్త విద్యార్థులు పాఠశాలలో చేరడం శుభ పరిణామమని అన్నారు. తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగిందని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించడంలో ప్రభుత్వ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. విద్యార్థులు చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా అభ్యసించాలని, తల్లిదండ్రులు ఇంటి వద్ద మంచి వాతావరణం కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనరసయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్త, మండల విద్యాధికారి టి. సత్యనారాయణ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ దబ్బెటి శైలజ, కౌన్సిలర్ కురుమిళ్ల ప్రమీల రాములు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పోచం నారాయణ, కొణతం దామోదర్ రాయుడు, చక్రధర్ రావు, అవిశెట్టి అవిలిమల్లు, వారాల యాదగిరి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
