మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజల సిద్ధం కావాలి
- ప్రజా పోరాటాల్లో సిపిఎం ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుంది
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పిలుపు జాన్ వెస్లీ
వలిగొండ, ఆంధ్రప్రభ : రైతులు, కూలీలు, కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించేందుకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సుంకిశాల గ్రామంలో సీపీఎం మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా సోమవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభకు గ్రామ సర్పంచ్ పైళ్ల సంధ్యారాణి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రైతులు, కూలీలు, కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాల అమలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావడం, ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించడం వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
దేశంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉచిత విద్య, వైద్యం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం వల్ల సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ మాట్లాడుతూ, తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులు రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం ప్రజానాట్య మండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో “వీర తెలంగాణ” వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన వందలాది మంది ప్రజలు వీక్షించారు.
ఈ బహిరంగ సభలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, గణపతి రెడ్డి, గడ్డం వెంకటేశం, బొడ్డుపల్లి వెంకటేశం, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు గంటపాక శివ, జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు వాకిటి వెంకటరెడ్డి, కందడి సత్తిరెడ్డి, మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు, కవిడే సురేష్, సీనియర్ నాయకులు కళ్లెం సుదర్శన్ రెడ్డి, కొండే కిష్టయ్య, పైన ఉపేందర్ రెడ్డి, మంగ బాలయ్య, చెరుకు జంగయ్య, ఈర్లపల్లి నరసింహ, దేశపాక నవనీత, పైళ్ల సరిత, పోలేపల్లి హమీద, కాటేపల్లి వనజతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
