జగన్ వైఫల్యాలను ప్రజలు మరిచిపోలేరుసంక్షేమం..
జగన్ వైఫల్యాలను ప్రజలు మరిచిపోలేరుసంక్షేమం..
ఉద్యోగాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఆదర్శంఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ
విజయవాడ, ఆంధ్రప్రభ:
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యం, వైఫల్యాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో ఆదర్శంగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు.
సోమవారం కూటమి 5వ డివిజన్ క్రీస్తురాజపురం ప్రాథమిక కేంద్రం పరిధిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గద్దె అనురాధ పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే సామాజిక పింఛన్లను పెంచి ఎన్నికల హామీని నిలబెట్టుకుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన లబ్ధిదారులకు గౌరవప్రదమైన పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని అన్నారు.
జగన్ పాలనలో ఐదేళ్ల పాటు దివ్యాంగుల పింఛన్ల పెంపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచి వారి పట్ల బాధ్యతను చాటిందని పేర్కొన్నారు.
ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గద్దె అనురాధ ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదని, ఇప్పుడు డీఎస్సీ అభ్యర్థుల ప్రతిభను కించపరిచేలా తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి వేలాది కుటుంబాల్లో ఆనందం నింపిందని తెలిపారు. ప్రతిభ ఆధారంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించిన డీఎస్సీ ద్వారా అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు.
ప్రజలకు సంక్షేమం అందించడం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రతి వర్గం అభ్యున్నతికి కృషి చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గద్దె అనురాధ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే వైఎస్సార్సీపీ నేతలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బచ్చలకూర అజయ్, నందిపాటి దేవానంద్, చలసాని రమణ, దోమకొండ రవి, బోరుగడ్డ ప్రసాద్, రెమ్మనపూడి బ్రహ్మేశ్వరరావు, కట్టేవరపు శ్యామ్, షేక్ హనీఫ్, పి. వెంకట్రావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
