నీరు లేక వెలవెల బోతున్న ఎస్సారెస్పీ

జూలై మధ్య మాసం దాటుతున్న ఇప్పటి వరకు రాని వరద నీరు

15 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ

ఆందోళన చెందుతున్న ఆయకట్టు రైతున్నలు

బాల్కొండ, (ఆంధ్రప్రభ): ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి ప్రస్తుత సంవత్సరం ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు చుక్క నీరు రాలేదు. దీంతో ఆయకట్టు రైతులు ‘శ్రీరామా..! కరుణించవేమయా..!!’ అంటూ వేడుకుంటున్నారు.ఎస్సారెస్పీలోకి గతేడాది జూలై మధ్య మాసం వరకు భారీ వరద నీరు వచ్చి ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. కాని ప్రస్తుత సంవత్సరం ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు చుక్క నీరు వచ్చి చేరలేదు. దీంతో ఆయకట్టు పంటల సాగుపై భరోసా సన్నగిల్లుతుండటంతో రైతులు కలవర పడుతున్నారు.

సాగు పై సందిగ్ధo..

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆధారంగా 18 లక్షల ఎకరాల ఆయకట్టు లో పంటలు సాగువుతాయి. ప్రస్తుత సంవత్సరం ప్రాజెక్ట్ లోకి ఆశించినంత నీరు చేరక పోవడంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా ఆందోళన చెందడంతో పాటు పంటల సాగు పై సందిగ్ధం ఏర్పాడింది. ప్రాజెక్ట్ ఖరీప్ లో ఆయకట్టుకు నీరు అందించాలంటే కనీసం 56 టీఎంసీల నీరు నిల్వ ఉండాలి. కాని ప్రస్తుతం ప్రాజెక్ట్ 15 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.దీంతో పంటల సాగు చేయడం కష్టంగానే ఉంది. ప్రాజెక్ట్ నుంచి ప్రధానంగా కాకతీయ,లక్ష్మి,సరస్వతి కాలువల ద్వారా నీటి విడుదలను చేపడుతారు. ప్రస్తుతం నీటి నిల్వ ఆధారంగా ఏ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టే అవకాశం లేదు. దీంతో ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉంది.

నిరాశజనకంగా నీటిమట్టం..

ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం నిరాశజనకంగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అందులో 5 టీఎంసీలు డెడ్ స్టోరేజీ, 5టీఎంసీలుతాగు నీటి అవసరాలకు, మరో 5 టీఎంసీలు ఆవిరి రూపంలో పోతుంది. అంటే ప్రస్తుతం ఉన్నా నీటి నిల్వ తాగు నీటి అవసరాలకు మాత్రమే సరిపోతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరదలు సకాలంలో వచ్చి చేరితే తప్ప ప్రస్తుత ఖరీఫ్ పై ఆశాలు లేనట్లే..!