ప్రమాద బాధితులను అర్ధరాత్రి పరామర్శించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య
నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నందికొట్కూరు మండలంలోని శాతనకోట గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అల్లూరు గ్రామానికి చెందిన ఉపాధి కూలీలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పరామర్శించారు. పొలం పనులు ముగించుకుని బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా వాహనం అదుపుతప్పి కేసీ కెనాల్‌లో బోల్తాపడటంతో 15 మంది కూలీలు గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని బయటకు తీసి 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య రాత్రి 9 గంటలు దాటినప్పటికీ ఆలస్యం చేయకుండా కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఒక్కొక్కరిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని వైద్యులకు తెలిపారు.
అనంతరం ఆస్పత్రి వద్ద ఉన్న బాధిత కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని, వైద్య చికిత్స విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాత్రి వేళైనా సొంత గ్రామ ప్రజల కోసం ఆస్పత్రికి చేరుకుని పరామర్శించిన ఎమ్మెల్యే జయసూర్య చొరవను గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు అభినందించారు.
