గుడివాడలో జైన్ మత గురువుల చాతుర్మాస దీక్ష ప్రారంభం
గుడివాడ, ఆంధ్రప్రభ: గుడివాడ పట్టణంలో జైన్ మత గురువుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చాతుర్మాస దీక్షలో భాగంగా నాలుగు నెలల పాటు గుడివాడలో బస చేయనున్న జైన్ శ్వేతాంబర్ మత గురువులకు మార్వాడి జైన్ సమాజం ఆదివారం ఘన స్వాగతం పలికింది.
పట్టణంలోని 9వ వార్డులో ఉన్న శ్రీ పార్శ్వనాథ్ జైన్ శ్వేతాంబర్ దేవాలయానికి చేరుకున్న మత గురువులకు భక్తులు పూర్ణకుంభ స్వాగతం అందించి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గురువుల ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా జైన్ చిన్నారులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దేవాలయ నిర్వాహకులు మాట్లాడుతూ చాతుర్మాస దీక్ష సందర్భంగా రానున్న నాలుగు నెలల పాటు మత గురువులు శ్రీ పార్శ్వనాథ్ జైన్ శ్వేతాంబర్ దేవాలయంలోనే నివసిస్తూ ప్రతిరోజూ ఆధ్యాత్మిక ప్రవచనాలు, ధార్మిక బోధనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
