ఆర్కే బీచ్‌లో తృటిలో తప్పిన ప్రమాదం.. పర్యాటకురాలిని కాపాడిన లైఫ్‌గార్డ్

విశాఖపట్నం, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ఆదివారం మరోసారి ప్రమాదం తృటిలో తప్పింది. తెలంగాణకు చెందిన ముగ్గురు మహిళా పర్యాటకులు సముద్రంలో స్నానానికి దిగగా, వారిలో సుజాత (56) అలల ఉద్ధృతికి సముద్రంలో కొంతదూరం కొట్టుకుపోయింది.

విషయాన్ని గమనించిన బీచ్ లైఫ్‌గార్డ్ ఎం. ధనరాజు వెంటనే అప్రమత్తమై సముద్రంలోకి దిగి సుజాతను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. దీంతో అక్కడున్న పర్యాటకులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆర్కే బీచ్‌లో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. లైఫ్‌గార్డ్ ధనరాజు సమయస్ఫూర్తితో స్పందించడంతో మరో ప్రమాదం తప్పిందని స్థానికులు ప్రశంసించారు.