గోదావరి ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.25 వేల తక్షణ సాయం
రంపచోడవరం కలెక్టరేట్, ఆంధ్రప్రభ: గోదావరి నదిలో శనివారం జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు గిరిజనుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందజేసినట్లు పోలవరం (రంపచోడవరం) జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ద్వారా ఈ సాయాన్ని అందించామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు పూర్తి పరిహారంతో పాటు ఇతర సంక్షేమ ప్రయోజనాలు కూడా అత్యవసరంగా అందేలా చర్యలు చేపట్టినట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు నిరంతరం అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు కొనసాగిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. వర్షాకాలంలో గోదావరి నదిలో నీటి మట్టం, ప్రవాహం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉన్నందున గిరిజనులు, మత్స్యకారులు, నదిపై ఆధారపడి జీవించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాతావరణ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలు జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న సమయంలో చేపల వేటకు లేదా ఇతర అవసరాల కోసం నదిలోకి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్థానిక రెవెన్యూ, పోలీసు లేదా విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.
