భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత…

భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత…

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూగర్భ జలాల పెంపుదల,నీటి సంరక్షణ కోసం నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో ఈనెల 6 నుండి జూలై 14, వరకు 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది.ఈ కార్యక్రమం కింద సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులను ఎ.కొండూరు మండలం, రేపూడి గ్రామంలో సోమవారం తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వర్షపు నీటిని సమర్థంగా నిల్వ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరత సమస్యను అధిగమించవచ్చన్నారు. చెరువులు,కాలువలు శుభ్రపరిచే పనులు వేగవంతంగా పూర్తి చేసి రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నీటి మట్టం పెరగడం, వ్యవసాయానికి అవసరమైన నీటి లభ్యత మెరుగుపడటం, పంటల దిగుబడులు పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.

అలాగే సాగునీటి సంఘాల సభ్యులు చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ ద్వారా చెరువుల లోతు పెంపు, మట్టి తొలగింపు పనులు చేపట్టడం,కాలువల శుద్ధి, మరమ్మత్తులు పూర్తి చేయడం, వర్షపు నీటి సేకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం,భూగర్భ జలాల మట్టాన్ని స్థిరంగా పెంచడం, రైతులకు సాగునీటి లభ్యతను మెరుగుపరచడం వంటి పనులు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బొజ్జ గాని శ్రీనివాసరావు, మండల టిడిపి సీనియర్ నాయకులు గడ్డి కృష్ణారెడ్డి, డి సి.కమిటీ ఛైర్మన్ కఠారు కోటేశ్వరరావు, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మలమంటి ఏలియా బాబు, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బి.గోపిరాజు, నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులు, సాగునీటి సంఘాల సభ్యులు, పార్టీ నాయకులు, రైతులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply