బాపట్లలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

బాపట్ల, ఆంధ్రప్రభ: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సంఘ వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా బాపట్ల పట్టణ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున స్థానిక డీఎంపల్లిలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీలు ఉదయం 4.30 గంటలకు ప్రారంభమయ్యాయి.

ఈ ఆపరేషన్‌లో డీఎస్పీ చంద్రమౌళి పర్యవేక్షణలో పట్టణ సీఐ రాంబాబు, రూరల్ సీఐ ప్రభాకర్, సర్కిల్ సీఐ హరికృష్ణతో పాటు సివిల్ పోలీసులు, హోంగార్డులు కలిపి మొత్తం 100 మంది సిబ్బంది పాల్గొన్నారు. సోదాల సందర్భంగా పలు నివాసాలు, అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేయగా, పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రమౌళి మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నేర కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.