ఈహెచ్ఎస్ వేతన కోతలు తక్షణమే నిలిపివేయాలి

ఈహెచ్ఎస్ వేతన కోతలు తక్షణమే నిలిపివేయాలి

  • ఎస్‌టీయూ

తొర్రూరు, ఆంధ్రప్రభ:

ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ప్రవేశపెడుతున్న నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంబంధించిన పూర్తి విధివిధానాలు ఖరారు కాకముందే, ఉద్యోగుల మే నెల వేతనాల నుంచి మినహాయింపులు చేపట్టడం సరైనది కాదని ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి సుధాకరాచారి అన్నారు.

డివిజన్ కేంద్రంలో ఆదివారం సుధాకరాచారి మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యుల నమోదు ప్రక్రియ ఇంకా 50 శాతం కూడా పూర్తి కాలేదని తెలిపారు. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో తరచూ మార్పులు జరుగుతుండటంతో అనేక మంది ఉద్యోగులు ఇంకా పూర్తి వివరాలు నమోదు చేయలేకపోయారని అన్నారు.

కుటుంబ సభ్యుల అర్హత, భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే చందా మినహాయింపు విధానం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆరోగ్య పథకం అమలుకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, అన్ని సందేహాలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేసిన తర్వాతే అమలు చర్యలు చేపట్టాలని సుధాకరాచారి కోరారు. అలా చేయకుండా ముందస్తుగా వేతనాల్లో కోతలు విధించడం ఉద్యోగుల్లో అసంతృప్తికి దారితీస్తోందని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకుని, ఈహెచ్ఎస్ చందా పేరిట జరుగుతున్న వేతన కోతలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయి విధివిధానాలు ప్రకటించిన తర్వాత మాత్రమే పథకాన్ని అమలు చేయాలని సుధాకరాచారి కోరారు.