Kamadhenu Project | సహకార రంగంలో ఆదర్శ మోడల్

Kamadhenu Project | సహకార రంగంలో ఆదర్శ మోడల్

Kamadhenu Project | రూ.110 కోట్ల రుణాన్ని ముందే తీర్చిన యూనియన్
ప్రాజెక్ట్ కామధేను ఆధునిక పాల ప్రాసెసింగ్ కేంద్రం
వరదల సమయంలో వ్యవస్థకు అండగా నిలిచిన ప్లాంట్

Kamadhenu Project | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: పాడి రైతుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ముందుకు సాగుతున్న కృష్ణా మిల్క్ యూనియన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వీరవల్లిలో నిర్మించిన అత్యాధునిక ‘ప్రాజెక్ట్ కామధేను’ ప్లాంట్ కోసం తీసుకున్న రూ.110 కోట్ల బ్యాంకు రుణాన్ని కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే పూర్తిగా తీర్చడం ద్వారా సహకార రంగంలో ఆదర్శంగా నిలిచింది.

ఏడు సంవత్సరాల గడువుతో తీసుకున్న రుణాన్ని నిర్ణీత కాలానికి ఎంతో ముందుగానే చెల్లించడం యూనియన్ ఆర్థిక క్రమశిక్షణకు, సమర్థ నిర్వహణకు నిదర్శనంగా నిలిచింది. కృష్ణా జిల్లా పాడి రైతుల దశాబ్దాల కలగా భావించిన ప్రాజెక్ట్ కామధేను ప్లాంట్‌ను మొదట రూ.185 కోట్ల అంచనాతో ప్రతిపాదించగా, వ్యయ నియంత్రణ, సమర్థ ప్రణాళికతో కేవలం రూ.163 కోట్ల వ్యయంతో పూర్తి చేయడం విశేషం.

వీరవల్లి గ్రామంలో నిర్మితమైన ఈ అత్యాధునిక పూర్తి ఆటోమేషన్ ప్లాంట్ ప్రస్తుతం రోజుకు 6 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉండగా, భవిష్యత్తులో 8 లక్షల లీటర్ల వరకు విస్తరించేలా రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు విజయానికి పాడి రైతుల విశ్వాసం, ఉద్యోగుల అంకితభావం, యూనియన్ సమర్థ నిర్వహణ ప్రధాన బలాలుగా నిలిచాయి. సహకార రంగంలో సాధారణంగా రుణభారం దీర్ఘకాలం కొనసాగుతుంటే, కృష్ణా మిల్క్ యూనియన్ మాత్రం స్వల్ప కాలంలోనే రుణ విముక్తి సాధించి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.


వరదల సమయంలో ఆదుకున్న తీరు

ఇటీవల విజయవాడలో బుడమేరు వరదల కారణంగా ప్రధాన ఫ్యాక్టరీ 42 రోజులపాటు మూతపడటంతో సుమారు రూ.24 కోట్ల నష్టం వాటిల్లినా, కామధేను ప్లాంట్ యూనియన్‌కు అండగా నిలిచింది. మొత్తం పాల ప్రాసెసింగ్‌ను వీరవల్లి ప్లాంట్‌కు మళ్లించడం ద్వారా పాల సేకరణ, ఉత్పత్తి, మార్కెటింగ్ కార్యకలాపాలను నిరాటంకంగా కొనసాగించగలిగింది.

దీంతో వేలాది మంది పాడి రైతుల ఆదాయం, వినియోగదారులకు పాల సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగింది. మ్యాక్ చట్ట రూపకర్త, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మారకార్థం ఈ ప్లాంట్‌కు ఆయన పేరు పెట్టడం ప్రత్యేకతగా నిలిచింది. రైతు సంక్షేమానికి అంకితమైన నాయకుడి పేరును ఈ ప్రాజెక్టుకు నామకరణం చేయడం ద్వారా కృష్ణా జిల్లా రైతాంగానికి, భావితరాలకు ఈ ప్లాంట్‌ను అంకితం చేసినట్లు యూనియన్ ప్రతినిధులు పేర్కొన్నారు.

పాడి రైతుల ఆర్థిక భద్రత, ఆధునిక పాల పరిశ్రమ అభివృద్ధి, సహకార రంగ బలోపేతానికి ప్రతీకగా నిలిచిన ప్రాజెక్ట్ కామధేను ఇప్పుడు కృష్ణా జిల్లాకే కాకుండా రాష్ట్ర సహకార రంగానికి ఒక విజయ మోడల్‌గా మారింది. రైతుల కలలను సాకారం చేయడమే కాకుండా, సంక్షోభ సమయంలోనూ నిలబడి వ్యవస్థను కాపాడిన ఈ ప్రాజెక్ట్ కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది.