తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం

తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం

  • కొనుగోలు కేంద్రాల నుండి తరలించేందుకు చర్యలు.
  • గోదాముల్లో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు.
  • ధాన్యం రావాణాకు లారీలు అందుబాటులో ఉంచుతాం.
  • ప్రభుత్వ విప్ విజయ రమణారావు.

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో మిగిలిన ధాన్యాన్ని, వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు హామీ ఇచ్చారు. పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి రోడ్డులో గల రైస్ మిల్లు గోదాంలో నిల్వచేసిన వరి ధాన్యాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి కొనుగోలు సెంటర్ లో ఉన్న వరి ధాన్యం 98 శాతం ఇప్పటికే తరలించామని తెలిపారు.

పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో లారీల జాప్యం, హమాలీల కొరతతో అక్కడక్కడ కొంతమేర మిగిలి ఉన్న ధాన్యాన్ని తరలించేందుకు పెద్దపల్లి, సుల్తానాబాద్ లారీ అసోసియేషన్ అధ్యక్షలు భారీ, తిరుపతి, శ్రీనివాస్, సతీష్ లతో మాట్లాడి పెద్దపల్లి, సుల్తానాబాద్ సీఐలు ప్రవీణ్, రంజిత్ రావు, ఎస్ఐలు, పోలీసులు, ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో పూర్తిస్థాయిలో తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హమాలీల కొరత లేకుండా మరి కొంతమంది హమాలీలతో మాట్లాడామని, పూర్తిస్థాయిలో రెండు మూడు రోజులలో ధాన్యాన్ని లిఫ్ట్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

కేరళకు రుతుపవనాలు తాకాయని త్వరితగతిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో తరలిస్తామని పేర్కొన్నారు. అలాగే మక్కలను సైతం నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి తరలించామని తెలిపారు. ఇప్పటివరకు రైతుల ఖాతాలలో నాలుగు కోట్ల రూపాయలు జమ అయ్యాయని, మిగిలిన రూపాయలు సైతం త్వరలోనే రైతుల ఖాతాలో జమ కానున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, పలు గ్రామాల సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూదరి మహేందర్, ఎరుకల రమేష్, అక్కేపల్లి క్రాంతి కుమార్, అర్కుటి సంతోష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.