ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలి

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలి

  • బాధితులకు అండగా నిలవాలి
  • నేర స‌మీక్ష స‌మావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్
  • ఉత్త‌మ‌ అధికారులకు ప్ర‌శంసా ప‌త్రాలు అంద‌జేత‌

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌ : ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును వేగంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష‌ సమావేశంలో ఆయన పోలీసు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్, ఎన్‌బీడబ్ల్యూ కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ, లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

దర్యాప్తులో సందేహాలు ఉంటే ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదగా వ్యవహరించి వారికి భరోసా కల్పించాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి విలేజ్ పోలీసు అధికారిని నియమించి రౌడీ షీటర్లు, కేడీలు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్‌హెచ్‌ఓలకు సూచించారు. మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు
సబ్ డివిజనల్ పోలీసు అధికారులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, బ్లూ కోల్ట్స్, నైట్ పెట్రోలింగ్ సిబ్బంది “పాపిలాన్ డివైస్” ద్వారా అనుమానితుల ఫింగర్‌ప్రింట్లను సేకరిస్తూ నిఘాను మరింత బలోపేతం చేయాలని సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, ప్రతి గ్రామంలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, దాబాలు, పెట్రోల్ బంకులు తదితర కీలక ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు వివిధ సంఘాల సహకారం తీసుకోవాలని ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ న‌గ‌దుతోపాటు ప్రశంసాపత్రాలు అందజేశారు.
ప్ర‌తిభక‌న‌బ‌ర్చిన వారికి ప్రోత్సాహం
పోలీస్ స్టేషన్లలో ప్రతిభ కనబరిచే సిబ్బందిని గుర్తించి ప్రశంసాపత్రాలకు సిఫారసు చేయాలని ఎస్‌హెచ్‌ఓలకు సూచించారు. అనంతరం పోలీసు వాహనాల పనితీరును పరిశీలించిన ఎస్పీ, ప్రతి వాహనానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించి అత్యవసర కిట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని డ్రైవర్లకు సూచించారు. వాహనాలను పరిశుభ్రంగా నిర్వహించిన డ్రైవర్లకు ప్రత్యేక రివార్డులు ప్రకటించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు సత్యయ్యగౌడ్, ప్రభాకర్, వెంకట్‌రెడ్డి, సైదానాయక్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్‌స్పెక్టర్లు రమేష్, కిరణ్ కుమార్, నాగేశ్వర్‌రావు, సదా నాగరాజు, ప్రవీణ్‌రెడ్డి, ఫింగర్‌ప్రింట్ ఇన్‌స్పెక్టర్ వినయ్ కుమార్‌తో పాటు జిల్లా ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.