రూ.25.2 కోట్లతో బోనకల్‌కు 6 బ్రిడ్జిలు మంజూరు
రూ.25.2 కోట్లతో బోనకల్‌కు 6 బ్రిడ్జిలు మంజూరు
- రవాణా కష్టాలకు చెక్..
- దశాబ్దాల కల సాకారం చేసిన డిప్యూటీ సీఎం
- కాంగ్రెస్ నాయకుల హర్షం
బోనకల్, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా, బోనకల్ మండల ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. వర్షాకాలంలో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో బోనకల్ మండలానికి రూ.25.2 కోట్ల వ్యయంతో ఆరు బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరరావు, జిల్లా సీనియర్ నాయకులు పైడిపల్లి కిషోర్ కుమార్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.
మండలంలో మంజూరైన బ్రిడ్జి పనులు ఇవే
కలకోట–మోటమర్రి రోడ్డుపై కలకోట గ్రామ సమీపంలో రూ.4.2 కోట్లతో ఒక హై లెవల్ బ్రిడ్జి, అదే రోడ్డుపై మరో రూ.5 కోట్ల వ్యయంతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రావినూతల–ప్రొద్దుటూరు రోడ్డులో గార్లపాడు, ఎల్.గోవిందాపురం, ప్రొద్దుటూరు గ్రామాల పరిధిలో రూ.8 కోట్లతో మూడు మైనర్ బ్రిడ్జిల పునర్నిర్మాణానికి ఆమోదం లభించింది. బోనకల్–ఆళ్ళపాడు రోడ్డులో అళ్లపాడు గ్రామం వద్ద రూ.8 కోట్లతో హై లెవల్ బ్రిడ్జి నిర్మించనున్నారు.
ప్రజలకు రవాణా కష్టాలు తీరినట్లే..!
ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి పూర్తిగా తొలగిపోనుంది. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించడంతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు సురక్షితంగా ప్రయాణించే అవకాశం కలుగనుంది. అత్యవసర వైద్య సేవల విషయంలో రాకపోకలకు కూడా ఎలాంటి ఆటంకం ఉండదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
అభివృద్ధికి మరో మైలురాయి
మధిర నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి, భట్టి విక్రమార్క దూర దృష్టికి ఈ బ్రిడ్జిల మంజూరు నిదర్శనమని మండల కాంగ్రేస్ కాంగ్రెస్ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మండల ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన అపర భగీరథుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
