ఐఐఐటీ బాసరలో సీటు సాధించిన శ్రీవిద్యకు అభినందనలు
ఐఐఐటీ బాసరలో సీటు సాధించిన శ్రీవిద్యకు అభినందనలు
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన హెచ్చు నర్సింహ కుమార్తె హెచ్చు శ్రీవిద్య ఇటీవల విడుదలైన ఐఐఐటీ బాసర తొలి విడత ఎంపికల జాబితాలో చోటు దక్కించుకోవడంతో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ఆమెను అభినందించారు. చిన్నకాపర్తి గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా శ్రీవిద్య విద్యా ప్రతిభను కొనియాడిన ఎమ్మెల్యే వేముల వీరేశం రూ.10 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ నగదు బహుమతిని శ్రీవిద్యకు అందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించడం ఆనందదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్యక్రమంలో వార్డు సభ్యుడు దేశపాక మధు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వలిగొండ సత్యనారాయణ, పల్లపు ప్రశాంత్ తదితరులు పాల్గొని శ్రీవిద్యను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఆదర్శంగా నిలవాలని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
