Thorrur ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
Thorrur ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
- ప్రైవేట్ స్కూళ్ల నుంచి 12 మంది విద్యార్థులకు ప్రభుత్వ బడిలో ప్రవేశాలు
తొర్రూరు (Thorrur), ఆంధ్రప్రభ
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) సత్యనారాయణ మూర్తి అన్నారు. మండలంలోని చీకటాయపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, ఏకరూప దుస్తులు, రవాణా అలవెన్స్ వంటి అనేక సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు తమ ఊరి బడిని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా రంగాల్లోనూ విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రైవేట్ పాఠశాలల నుంచి 12 మంది విద్యార్థులను చీకటాయపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్పించి, వారికి నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల భవనానికి అందంగా రంగులు వేయించిన గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తిని డీఈవో సన్మానించారు.
అనంతరం మండలంలోని గుర్తూరు గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల చేరికలపై అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచ్ విస్సంపల్లి కవితా బాలకృష్ణ తమ ఇద్దరు మనవరాళ్లను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినందుకు వారిని ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈవో మహంకాళి బుచ్చయ్య, సీఎంఓ వంగ సురేష్, ఏఎస్సీ సంతోష్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, తిరుమలేష్, అశోక్, రవీందర్, సీతారాం ప్రసాద్, గౌతమి, వెంకట సత్యనారాయణ, రాజ్‌కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
