గన్నవరంలో సి-డాక్ కేంద్రం ఏర్పాటుకు వేగం

గన్నవరంలో సి-డాక్ కేంద్రం ఏర్పాటుకు వేగం

  • ఎమ్మెల్యే యార్లగడ్డ కృషి

గన్నవరం, ఆంధ్రప్రభ: గన్నవరం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్) కేంద్రాన్ని గన్నవరంలో ఏర్పాటు చేయాలనే దిశగా గత మూడు నెలలుగా చర్యలను ముమ్మరం చేశారు.

మూడు నెలల క్రితం సి-డాక్ ప్రతినిధి బృందాన్ని స్వయంగా కలిసి గన్నవరానికి ఆహ్వానించిన ఆయన, ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లతో ప్రాథమిక చర్చలు జరిపారు. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఉన్న సి-డాక్, ఆంధ్రప్రదేశ్‌లో 13వ కేంద్రంగా గన్నవరంలో ఏర్పాటు కానుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.200 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే విన్నపం మేరకు గన్నవరానికి వచ్చిన సి-డాక్ ప్రతినిధి బృందం, స్థానికంగా అందుబాటులో ఉన్న స్థలాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించి ఈ ప్రాంతం కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని సంతృప్తి వ్యక్తం చేసింది.

శుక్రవారం విజయవాడలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సి-డాక్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో దాదాపు మూడు గంటల పాటు ప్రాజెక్టు రూపకల్పనపై లోతైన చర్చలు జరిగాయి. గన్నవరంలో హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ, అధునాతన ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పరిశోధనలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఈ కేంద్రం ద్వారా ఐటీ, డేటా సైన్స్ రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని, స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఏఐ, విఎల్‌ఎస్‌ఐ వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రతిపాదించారు.

డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా గన్నవరాన్ని ఆధునిక సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే వెంకట్రావు స్పష్టం చేశారు. త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌లతో మరోసారి చర్చించి సి-డాక్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తానని తెలిపారు.