నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ కీలకం
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
గ్రామీణ యువతకు సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాలని సూచన
వేములవాడ, ఆంధ్రప్రభ: గ్రామాల్లో నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువయ్యేలా అధికారులు పనిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. మత్తు పదార్థాలు, సైబర్ నేరాల నివారణపై గ్రామీణ యువతలో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, వారు ప్రదర్శించిన ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్‌ను పరిశీలించి అభినందించారు.
అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించారు. ప్రజలకు అందుతున్న పోలీసు సేవలపై కూడా ప్రత్యేకంగా ఆరా తీశారు.
ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని ఎస్పీ సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత విధానాన్ని పాటించాలని ఆదేశించారు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరును అభినందించారు.
విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా అధికారులు, విపివోలు గ్రామాల్లో నిరంతరం పర్యటిస్తూ ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరేలా సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. బ్లూ కోల్ట్, పెట్రోకార్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి అనుమానితులు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.
గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, నేరాల నియంత్రణతో పాటు కేసుల ఛేదనలో వాటి పాత్రను తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ వెంకట్రాజం తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
