రెండేళ్లుగా నిలిచిన పెన్షన్లకు మోక్షం

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : మండలంలోని ఐలాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో దాదాపు రెండేళ్లుగా నిలిచిపోయిన పెన్షన్ల సమస్యకు పరిష్కారం లభించింది. అర్హులను గుర్తించిన ప్రభుత్వం తాజాగా 15 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్లు మంజూరు చేసింది. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పీరిలా సురేష్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. మొత్తం 15 మందిలో 9 మందికి వృద్ధాప్య పెన్షన్లు, 5 మందికి వితంతు పెన్షన్లు, ఒకరికి వికలాంగుల పెన్షన్ అందజేశారు. ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పంచాయతీ కార్యదర్శి, ఛేంజింగ్ బీపీఎం తదితరులు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. పెన్షన్లు అందుకోవడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా అర్హత ఉన్నవారిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తించి పెన్షన్లు అందేలా కృషి చేస్తామని సర్పంచ్ పీరిలా సురేష్ తెలిపారు.