పంటల బీమా గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు..

  • రైతులు సద్వినియోగం చేసుకోవాలి : ఏడీఏ సత్యనారాయణ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి ఆధారిత పంటల బీమా నమోదు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఉరవకొండ వ్యవసాయ డివిజన్ సహాయ సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు, కరువు, అకాల వర్షాల వల్ల పంట దిగుబడి దెబ్బతిన్నప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు ఆర్థిక భద్రత లభిస్తుందని చెప్పారు.

ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తున్న రైతులు ఆగస్టు 15లోగా ప్రీమియం చెల్లించి బీమా నమోదు చేసుకోవాలని సూచించారు. దిగుబడి ఆధారిత పంటల బీమా కింద రైతు వాటా ప్రీమియంగా కంది పంటకు ఎకరానికి రూ.80, ఎర్ర మిరపకు రూ.576, జొన్నకు రూ.84, మొక్కజొన్నకు రూ.132, ఆముదానికి రూ.80 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

పంట కోత ప్రయోగాల ద్వారా లెక్కించిన వాస్తవ దిగుబడిని, గత ఏడు సంవత్సరాల సగటు ఆధారంగా నిర్ణయించిన హామీ దిగుబడితో పోల్చి నష్టం శాతాన్ని నిర్ధారించి పరిహారం అందజేస్తారని తెలిపారు. ఈ-క్రాప్ బుకింగ్‌లో ప్రతి రైతు తన పంట వివరాలు తప్పకుండా నమోదు అయ్యేలా చూసుకోవాలని సూచించారు.

ఉరవకొండ వ్యవసాయ డివిజన్ పరిధిలో జూలై 31 నాటికి దిగుబడి ఆధారిత పంటల బీమా కింద 30,254 మంది రైతులు 49,523 హెక్టార్లకు ప్రీమియం చెల్లించగా, వాతావరణ ఆధారిత పంటల బీమా కింద 8,666 మంది రైతులు 13,082 హెక్టార్లకు ప్రీమియం చెల్లించినట్లు సత్యనారాయణ వెల్లడించారు.